తెగుళ్ళు

వేరుకుళ్ళు తెగులు

భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనపడుతుంది.లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి.వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టుపై నుండి క్రిందికి వ్రేలాడుతూ వుంటాయి.

నివారణ

కిలో విత్తనానికి 2గ్రా.ట్రైకోడేర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.లేదా కార్బ౦డిజిమ్ 1గ్రా.లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.


నల్లమచ్చ తెగులు

ముందుగా ఆకులపై కోణాకారంలో నూనెరంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి మూడవదశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది.దీనినే 'బ్లాక్ ఆర్మ్'అని పిలుస్తారు.పైరు వివిధ దశలలో కనిపిస్తుంది.వర్షాకాలంలో మబ్బులు పట్టినపుడు ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది.

నివారణ

ఉధృతిని బట్టి 3-4పర్యాయాలు 15రోజుల వ్యవధిలో 10లీటర్ల నీటికి 1గ్రా.పౌషామైసిన్ లేక ప్లా౦టోమైసిన్ మరియు రాగి ధాతు సంభందిత మందులు(కాపర్ ఆక్సీక్లోరైడ్)30గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేయాలి.


ఆకుమచ్చ తెగులు

ఆల్టర్నేరియా ఆకుమచ్చ వలన ఆకులమీద మధ్యలో గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది. -హెల్మి౦తోస్పోరియం ఆకుమచ్చ వలన ఆకులమీద తేలిక గోధుమరంగు గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్యబాగం బూడిద రంగుతో చుట్టూ ఎర్రటి అంచులు ఏర్పడతాయి.

నివారణ

ఈ మూడు తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి2.5 గ్రా.మా౦కోజెబ్ లేదా రాగిధాతు మందు(కాపర్ ఆక్సీక్లోరైడ్) 3గ్రా.లేదా క్యూమాన్.ఎల్ 4మి.లీ.4-5పర్యాయాలు 15రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.


బూడిద తెగులు

ఆకుల మీద కోణాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.బూడిద తెగులు శిలీంద్ర బీజాలు ఆకులు అడుగుభాగాన ఏర్పడతాయి.ఉధృతిని బట్టి ఆకు పైభాగాన కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండుబారి రాలిపోతాయి.

నివారణ

లీటరు నీటికి కరిగే గంధకం 3గ్రా.లేదా 1గ్రా.కార్బ౦డిజిమ్ కలిపి పిచికారి చేయాలి లేదా పొడి గంధకం ఎకారాకు 8-10కిలోలు పవరు డస్టరును ఉపయోగించి చల్లాలి.

కాయకుళ్ళు తెగులు

ప్రత్తిపంట కాయదశలో ఉన్నపుడు వర్షాలు ఎక్కువగా పడితే అనేక రకాలైన శిలీ౦ద్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి.ఈ శిలీంధ్రాలు ఎక్కువగా కాయ తొలుచు పురుగుల వల్ల ఏర్పడన రంధ్రాల ద్వారా కాయలోనికి ప్రవేశిస్తాయి.

నివారణ

సాధారణంగా వాడే పురుగు మందులతో పాటు 10లీటర్ల నీటికి 1గ్రా.శిలీంధ్ర నాశనులైన పౌషామైసిన్ లేదా ప్లా౦టోమైసిన్,రాగిధాతు మందులు (కాపర్ ఆక్సీక్లోరైడ్)30 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేయాలి.


టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు

ఈ వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా ప్రత్తిని ఆశిస్తుంది.వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివరి ఆకులు కొద్దిగా పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయి.కొంత భాగం ఆకులు మాడిపోతాయి.కొత్త చిగురు ,పూత ఏర్పడదు.వయ్యారిభామ,గడ్డి చేమంతి,ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.కావున ఈ మొక్కలను నాశనం చేయాలి.

నివారణ

తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఎసిఫేట్ 1.5గ్రా.లేక మొనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేక థయోమిథాక్సామ్ 0.2గ్రా లేక ఇమిడాక్లోప్రిడ్ 0.3మి.లీ లేక ఎసిటామిప్రెడ్ 0.2గ్రా.చొప్పున వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మందులను మార్చి పిచికారి చేయాలి.

పండాకు తెగులు

ప్రత్తిలో ఆకులు ఎర్రబడటాన్ని పండాకు తెగులు అంటారు.ముఖ్యంగా ,ఇది మొక్క అడుగు భాగాన ఆకుల మీద కనపడుతుంది.ఆకులు మొదట ముదురు గులాబి రంగుకు మారి,ఆ తరువాత పూర్తి ఎర్రగా మారి,క్రమేపి ఎండిపోయి,రాలి పోతాయి.ఇది మొక్క 50నుండి60రోజుల దశ దాటినప్పటి నుండి రావడానికి అవకాశ౦ వుంది.ఇది చాలా తొందరగా వ్యాపించి,ఒక్కొక్కసారి పచ్చ దోమ ఉధృతిని కలిసి వున్నప్పుడు,పచ్చ దోమ వలన వచ్చిందేమోనన్న అనుమానం కూడ కలుగ జేస్తుంది.పండాకు తెగులు రావటానికి గల కారణాలను విశ్లేషి౦చినపుడు

  • మొక్కలో నత్రజని,పొటాషియం,బాస్వర౦ పోషక పదార్థ లోపం ఏర్పడటం.
  • రాత్రి ఉష్ణోగ్రత 21c కంటే తగ్గిపోవటం.
  • ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటం.
  • గాలి వేగం అధికంగా వుండటం.
నివారణ

పండాకు తెగులు నివారణకు 1% మెగ్నీషియం సల్ఫేట్ తో పాటుగా 2%యూరియా లేదా 1% డైఅమ్మోనియమ ఫాస్ఫేట్ కలిపి 5-7రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.