బోర్డోమిశ్రమ౦ తయారి:మైలతుతం,(కాపర్ సల్ఫేట్)పోడిసున్నం(లైమ్),నీటిని 1:1:100 నిష్పత్తిలో కలిపి తయారుచేస్తే 1% బోర్దోమిశ్రమం తయారవుతుంది. పోడిసున్నం లభించకపోతే,తడిసున్నం వాడొచ్చుకాని,పై మూడింటిని 1:1.5:100 నిష్పత్తిలో కలపాలి.సున్నంలో మట్టి,ఇసుక లేకుండా ఉండాలి.బజార్లలో దొరికే సున్నం సీల్డు సంచులలో ఉంటే మంచిది. మైలతుత్తంను మెత్తగా నూరాలి.రేపు మిశ్రమం చేస్తామనగా ముందురోజు మైలతుత్త౦ పొడిని నీటిలో కరగబెట్టాలి. బోర్దోమిశ్రమాన్ని రెండు విధాలుగా తయారుచేయవచ్చు.
మొదటి విధానం: సూచించిన మోతాదులో మైలతుత్త౦,సున్నం తీసుకొని వేరు వేరు పాత్రలలో తగినంత నీరుపోసి బాగా కలపాలి.సున్నం నీరున్న పాత్రలోకి మైలతుత్తం నీరు పోయాలి.పాత్రలన్నీ మట్టి,చెక్క లేదా ప్లాస్టిక్తో చేసినవే వాడాలి.
రెండవ విధానం: మైలతుత్తం మరియు సున్నం పొడులను విడి విడి పాత్రల్లో తగినంత నీటిలో కలిపి ఈ రెండు పాత్రల్లోని నీటిని ఒకేసారి మూడవ పాత్రల్లోకి పోయాలి.
ఉదాహరణకు,విడివిడి పాత్రల్లో 50 లీటర్ల నీటిని తీసుకొని ఒక దానిలో కిలో ,మైలతుత్తం,రెండో పాత్రలో కిలో సున్నం కలపాలి.ఈ రెండు పాత్రల్లోని నీటిని ఒకేసారి మూడవ పాత్రలోకి పోయాలి.అంటే ఒక శాతం బోర్దోమిశ్రమం తయారవ్తుంది.
బోర్దో మిశ్రమాన్ని ఉపయోగించే ముందు పరీక్ష చేయాలి.లిట్మస్ పేపరును మిశ్రమంలో ము౦చినపుడు ఎర్రగా మారకూడదు.లిట్మస్ పేపరు దొరకనిచో కొత్త బ్లేడు లేదా చాకును మిశ్రమంలో ము౦చినపుడు వాటిపై రాగిధాతువు చేరుకోకూడదు.అలా చేరితే మరికొంత సున్నం నీటిని కలపాలి.సున్నం ఎక్కువైతే మొక్కలకు హాని చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా పరీక్షిస్తూ మిశ్రమాన్ని తయారు చేయాలి.
బోర్దో పేస్టు:ఇందుకు ఒక కిలో మైలుతుత్తం పొడి,1.5కిలోల పొడిసున్నం,13.5 లీటర్లు నీరు కలపాలి.బోర్దో మిశ్రమంలాగే పరీక్షించి వాడాలి.బ్రష్ ను ఉపయోగించి విరిగిన,కత్తిరించిన కొమ్మ భాగాలకు,గాయమైన భాగాలకు,చెట్ల మొదళ్ళకు రాస్తే తెగుళ్ళు ఆశి౦చవు.
వివిధ సమగ్ర సస్య రక్షణ పద్దతుల్లో జీవ నియంత్రణ పద్దతులు చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.మనకు అందుబాటులో ఉన్న అనేక జీవ నియంత్రణ పద్దతుల్లో న్యూక్లియర్ పొలిహేడ్రోసిస్ వైరస్(ఎన్.పి.వి) ద్రావణం,తక్కువ ఖర్చుతో,రైతు స్తాయిలో తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది.ఎన్.పి.వి అనేది పురుగులకు వ్యాధిని కలుగచేసే ఒక వైరస్.ఈ వైరస్ కణాలు ఆకుల ద్వారా కానీ,ఇతర మొక్క భాగాల ద్వారా కానీ,పురుగు తిన్నప్పుడు జీర్ణకోశంలోకి ప్రవేశించి,అక్కడ ప్రత్యుత్పత్తి జరిపి జీర్ణాశయాన్ని బలహీనపరుస్తాయి.క్రమేపి వైరస్ కణాలు ఆకుల ద్వారా కానీ,ఇతర శరీరభాగాలన్ని౦టిలో ప్రవేశించడం వలన అన్ని వ్యవస్థలు దెబ్బతిని పురుగు చనిపోతుంది. ఇలా ఎన్.పి.వి వ్యాధి బారినపడి చనిపోయిన పురుగుల శరీరం ఉబ్బి,చర్మం వదులుగా ఉండి,తాకితే చర్మం పగిలి,అందులోంచి పోలలాంటి తెల్లని చిక్కటి ద్రవం బయటకు వస్తుంది.వ్యాధి సోకిన పురుగులు మొక్కల అంచులకు పాకి,తలక్రిందులుగా వేలాడుతూ చనిపోతాయి.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏ పురుగుతో తయారయ్యే వైరస్ అదే రకం పురుగును మాత్రమే చంపగలదు.ఉదా:శనగపచ్చ పురుగు నుండి వేరు చేసిన వైరస్,లద్దె పురుగుకు వ్యాధిని కలిగించలేదు.కాబట్టి ఏ జాతి పురుగుల వైరస్ ను అదే జాతికి చెందిన పురుగుల నివారణకు మాత్రమే వాడాలి.
పంట పొలాల నుంచి ఆరోగ్యంగా ఉన్న నాల్గవ దశ లార్వాలను ఇంజక్షన్ సీసాల్లోకి లేదా సెల్ వెల్స్(గదుల డబ్బాలు) ఒక్కోదానిలో ఒక్కొక్క లార్వాను సమీకరించు కోవాలి. చిన్న లార్వాలైతే వైరస్ ఉత్పత్తి తగ్గుతుంది.పెద్ద లార్వాలను ఎంచుకుని ఉన్నట్లయితే వాటిని చంపడానికి ఎక్కువ మోతాదులో వైరస్ వాడవలసి ఉంటుంది.కాబట్టి ఒక మోస్తరు సైజు(1.0-1.5 సెం.మీ.పొడవు) లార్వాలను ఎంచుకోవడం మంచిది.
ముందుగా శనగ గింజలను 6-8 గంటలు నానబెట్టి తరువాత ఒక పొడి గుడ్డపై ఆరబెట్టాలి.ఈ గింజల పై సరియైన మోతాదులో (ఒక కిలో విత్తనానికి 40ఎల్.ఇ) శుద్దమైన వైరస్ ద్రావణాన్ని (మదర్ కల్చర్)చిలకరించాలి. ఈ మదర్ కల్చర్ ద్రావణము వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో (బి.సి.లాబ్స్) లేదా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం లేదా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధానమైన కొన్ని పరిశోధన మండలికి అనుసంధానమైన కొన్ని పరిశోధనా కేంద్రాలలో లభిస్తుంది సీసాలలో సమీకరించిన లార్వాలకు ఈ వైరస్ కలిపినా 2లేదా 3శనగ గింజలను ఆహారంగా ఇవ్వాలి. తర్వాత సీసా మూతిని దూదితో బిగించాలి.వీలైతే ఈ సీసాలను అనుకూలమైన వాతావరణ పరిస్థితులలలో అంటే 25-30 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత మరియు 60-70 శాతం తేమ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.అవసరం అయితే 3వ రోజు తర్వాత ఈ లార్వాలను మాములు ఆహారం అనగా వైరస్ కలపని,నానబెట్టిన శనగలను ఇవ్వవచ్చు.
వైరస్ గురిచేసిన లార్వాలు 4-5రోజులకు వ్యాధి సోకి చనిపోతాయి.లార్వాలను మాత్రమే ఒక సీసాలో సమీకరించుకోవాలి.చనిపోయిన లార్వాలు మెత్తగా ఉంటాయి.కాబట్టి వాటి మీద బాక్టీరియా వృద్దిచెంది కుళ్ళిపోయిన చెడు వాసన రావడానికి ఆస్కారం ఉంది.కనుక సీసాల నుంచి చనిపోయిన లార్వాలను తీసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి.వైరస్ వ్యాధి సోకి చనిపోయిన లార్వాలను సమీకరించిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచుట వలన బాక్టీరియా వృద్ది ఆగిపోయి చెడు వాసన తగ్గుతుంది.
వైరస్ వ్యాధి సోకి చనిపోయిన లార్వాలను సమీకరించుకొన్న తరువాత,సమపాళ్ళలో శుభ్రమైన నీటిని కలిపి (250 లార్వాలకు 250మీ.లీ.నీరు),వాటిని గ్రైండర్లో వేసి చిక్కని ద్రవముగా మారే వరకు రుబ్బవలెను.ఈ ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోస్తే,పురుగులు శరీర భాగాలు వేరు చేయబడతాయి.చిక్కటి వైరస్ ద్రావణం మిగులుతుంది.వీలు ఉన్న ఎడల,వడగట్టిన ద్రావణాన్ని మరింత శుభ్రపరచడం కోసం చిన్న ట్యుబులలో పోసి సె౦ట్రిఫ్యూజ్లో 5000ఆర్.పి.ఎమ్. వద్ద 15నిమిషాలు తిప్పాలి.ఇలా చేయడం వలన ట్యూబు అడుగుభాగంలో వైరస్ కణాలు చేరి పేస్ట్ లాంటి పదార్ధంగా కనిపిస్తుంది.పై తేటను పొరవేసి,క్రింద చేరిన వైరస్ కణాలను ప్లాస్టిక్ డబ్బాలలో పోసి ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి.వైరస్ ద్రావణం నాణ్యతను హీమసైటో మీటరు మరియు అధిక శక్తి గల మైక్రోస్కోప్ ల ద్వారా పరీక్షించి వైరస్ కణాలను లెక్కించుట ద్వారా అంచనా వేయవచ్చు.
లద్దె పురుగు వైరస్ ను కూడ పైన తెలిపిన విధంగానే ఉత్పత్తి చేయవచ్చు.కానీ లద్దె పురుగు ఆహారంగా నానబెట్టిన శనగల బదులు లేత ఆముదము ఆకులు వాడాలి.ఆకులను మదర్ కల్చర్(లద్దె పురుగు ఎన్.పి.వి)లో ముంచి,ఆరబెట్టి లార్వాలను తినిపించాలి.
పొగాకు కషాయం తయారు చేయుటకుగాను 500గ్రాముల పొగాకును 4.5లీటర్ల నీటిలో 24గంటలు నానబెట్టాలి.320గ్రాముల బార్ సబ్బు పొడిని కలియబెట్టి తయారు చేసుకున్న పొగాకు కషాయానికి కలపాలి.ఈ ద్రావణాన్ని 6-7రెట్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొనవచ్చు.